Tuesday, 25 March 2014

జుమా నమాజ్‌

  

  జుమా నమాజ్‌ చేయటం విధి. దాని గురించి దేవుడు ఇలా ఆదేశిస్తున్నాడు: ''విశ్వసించిన ప్రజలారా! శుక్రవారం నాడు నమాజ్‌ కోసం పిలిచినప్పుడు, అల్లాహ్‌ా సంస్మరణ వైపు పరుగెత్తండి; క్రయవియ్రాలను వదలి పెట్టండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది''. (అల్‌ జుమా: 9)
  దైవవ్రక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ''పుట్టుక రీత్యా మనం గత సమాజాల వారందరికంటే చివర్లో ఉన్నా, స్వర్గానికి ముందుగా మనమే వెళ్తాం.  శక్రవారం (నాడు చేసే ఆరాధన) అందరిపైనా విధిగా చేయబడింది. కాని యూదులు, క్రైస్తవులు దాంతో విభేదించారు. యూదులు తమ ఆరాధన కోసం (తామే స్వయంగా) శనివారాన్ని నిర్ణయించుకున్నారు. క్రైస్తవులు ఆదివారాన్ని ఎంచుకున్నారు. అయితే ముస్లింల కొరకు దేవుడు శుక్రవారం రోజును నిర్ణయించాడు''. (బుఖారీ, ముస్లిం)
జుమా నమాజు నుంచి మినహాయించబడినవారు
 దైవవ్రక్త (స) ఇలా ప్రబోధించారు: ''జుమా నమాజును సామూహికంగా చేయడం ముస్లింలందిపై విధిగా చేయబడింది. అయితే బానిసలకు, స్త్రీలకు, పిల్లలకు, వ్యాధిగ్రస్తులకు, ప్రయాణికులకు ఇందులో మినహాయింపు ఉంది''. (అబూ దావూద్‌)
జుమా ఘనత, ప్ర్రాముఖ్యత
1) వారాలన్నింటికీ నాయకుడు లాంటిది శుక్రవారము (జుమా రోజు).
2) దేవుడు హజ్రత్‌ ఆదం (తి)ను పుట్టించింది జుమా రోజునే.(ముస్లిం)
3) ఆ రోజే దేవుడు ఆదం (అ)ను భూమి మీదకు దింపాడు. (ముస్లిం)
4) ఈదుల్‌ ఫితర్‌ (రమజాన్‌), ఈదుల్‌ అజ్హా (త్యాగోత్సవం) దినాలకన్నా జుమా రోజు శ్రేష్ఠమైనది. (ముస్నదె అహ్మద్‌)
5) జుమా రోజున ఒక ఘడియ వస్తుంది. ఆ సమయంలో దుఆ చేస్తే తప్పకుండా ఆమోదించబడుతుంది. దేవుని నుండి మంచిని ఆశించేవారికి అది తప్పకుండా లభిస్తుంది. బహుశా ఆ ఘడియ అస్ర్‌ నమాజ్‌ తర్వాత రావచ్చు. (అహ్మద్‌)
6) దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ''ఎవరైనా జుమా రోజు గుసుల్‌ చేసి జుమా నమాజు కొరకు మస్జిద్‌కు వెళ్ళి అక్కడ తను చేయగలిగినన్ని నమాజులు చేసి, ఆ తర్వాత ఉపన్యాసం ముగిసే వరకు నిశ్శబ్ధంగా ఉండి, శ్రద్ధగా ఉపన్యాసం విని ఇమామ్‌తోపాటు ఫర్జ్‌ నమాజ్‌ చేస్తే గత శుక్రవారం నుండి ఆ శుక్రవారం వరకు అతని వల్ల జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి. అంతే కాదు, అదనంగా మరో మూడ్రోజుల పాపాలు కూడా  క్షమించబడతాయి. (ముస్లిం)
7)  దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ''సూర్యుడు ఉదయించే రోజులన్నింటిలోకెల్లా జుమా రోజు అత్యంత శ్రేష్ఠమైనది. ఆదం (అ) పుట్టింది ఆ రోజే. ఆ రోజే ఆయన స్వర్గంలోకి ప్రవేశించారు. తిరిగి అదే రోజు ఆయన స్వర్గం నుండి భూమి మీదకు వచ్చారు. ప్రళయం కూడా అదే రోజు వస్తుంది''. (ముస్లిం)
8) హజ్రత్‌ అబూ హురైరా (ర) కథనం ప్రకారం  దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ''జుమా రోజు దైవదూతలు మస్జిద్‌ ద్వారం వద్ద నిలబడి జుమా నమాజు కొరకు మస్జిద్‌కు వచ్చేవారి పేర్లు వరుసగా నమోదు చేస్తూ ఉంటారు. మస్జిద్‌కు తొలి వేళప్పుడు వచ్చినవారికి ఒక ఒంటె ఖుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది. తరువాత వచ్చినవారికి పొట్టేలును ఖుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది. చివర్లో వచ్చేవారికి కోడి, ఆ తర్వాత వచ్చేవారికి గ్రుడ్డు దానం  చేసినంత పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత ఇమామ్‌ ఖుత్బా ఇవ్వడానికి బయలుదేరగానే దైవదూతలు రిజిష్టర్‌ మూసేసి ఖుత్బా వినడానికి కూర్చుంటారు''. (బుఖారీ, ముస్లిం)
దైవప్రవక్త (స) ఆగ్రహం
దైవప్రవక్త (స) జుమా నమాజు చేయనివారిపై మండిపడుతూ, ''ప్రజలకు నమాజు చేయించడానికి నా స్థానంలో మరొకరిని నిలబెట్టి జుమా నమాజుకు రాని వారిని పట్టుకుని వారి ఇళ్ళ సమేతంగా వారిని దహనం చేయాలని అనిపిస్తోంది'' అని అన్నారు. (ముస్లిం)
వరుసగా జుమా నమాజులు ఎగవేసేవాడి పర్యవసానం
ఆయన ఇంకా ఇలా అన్నారు: ''తగిన కారణం లేకుండా సోమరితనంతో వరుసగా మూడు జుమా (నమాజు)లు ఎగ్గొట్టినవారి హృదయాలను (సన్మార్గ భాగ్యం లభించకుండా) దేవుడు సీలు చేసేస్తాడు''. (అబూ దావూద్‌)
వేరొక హదీసులో ఇలా ఉంది: ''ప్రజలు జుమా నమాజును వదిలేయటాన్ని మానుకోవాలి లేదా దేవుడు వారి హృదయాలకు ముద్రవేస్తాడు.  తత్ఫలితంగా వారు (శాశ్వతంగా) ఏమరుపాటుకు లోనయ్యే ప్రమాదముంది''. (ముస్లిం)





ఇస్లాం దృష్టిలో సమాధుల పూజ


సాలెహ్ అల్  ఫౌజాన్ 


దైవ ప్రవక్త (స) క్రైస్తవుల్లో జొరబడిన షిర్క్‌ గురించి చెబుతూ ఇలా అన్నారు: ''వారు తమలోని పుణ్యపురుషులు  చనిపోయిన తరువాత వారి సమాధులపై మస్జిద్‌ కట్టి వివిధ భంగిమల్లో వారి ఫోటోలు తగిలించేవారు. అలాంటివారు అల్లాహ్‌ా దృష్టిలో ప్రజల్లోకెల్లా అత్యంత నీచమైన వాళ్ళు''. (ముత్తఫఖున్‌ అలై)
  సమాధుల వైపు తిరిగి నమాజు చేయడం కూడా దీనిలోకే వస్తుంది. ప్రవక్త (స) దీని గురించి ఇలా చెప్పారు: ''సమాధులపై 'ముజావర్‌'గా కూర్చోకండి. మరి వాటి వైపు తిరిగి నమాజు చేయకండి'' . (ముస్లిం)
 సమాధుల వైపు నిలబడి నమాజు చేయడం నిషిద్ధమైతే సమాధులపై నమాజు చేయడం ఇంకా తీవ్రమైన నిషిద్ధం.
   దైవ ప్రవక్త (స) వారి ఈ హదీసులు సమాధులను 'మస్జిద్‌'గా చేయడాన్ని ఖండిస్తున్నాయి. ఎందుకంటే దైవప్రవక్త (స) తన మరణానికి 5 రోజుల ముందు వీటి గురించి చాలా గట్టిగా తాకీదు చేశారు.
  దైవప్రవక్త (స) మనల్ని ఈ చర్యల నుండి రక్షించాలని పలు విధాల ఉదాహరణలతో చెప్పారు. 1) యూదులు, క్రైస్తవులను శపించటం. 2) వారి వినాశనం కోసం దుఆ. 3) దేవుని సృష్టిలో వారిని పరమ నీచులుగా ఖరారు చేయడం. 4) జాగ్రత్త! సమాధులను ప్రార్థనాలయాలుగా చేసుకోకండి అని చెప్పడం.
ముస్లింలలో అధికుల ధోరణి:
బాధాకరమైన విషయం ఏమిటంటే ముస్ల్లింలలో అధికులు దైవప్రవక్త (స) నిషేధించిన విష వలయంలోనే ఇరుక్కున్నారు. దైవప్రవక్త (స) నిషేధించిన   పని చేసి షిర్క్‌ అక్బర్‌లో పడిపోయారు. సమాధులపై మస్జిద్‌లు, దర్గాలు నిర్మించి వారి పేరున బలిదానాలు, దుఆలు, మొక్కుబడులు చెల్లిస్తున్నారు. తల నీలాలు సమర్పిస్తున్నారు. మరి వీరు దైవ దృష్టిలో ఎలాంటివారిగా  పరిగణించబడతారో?
    ఇమామ్‌ ఇబ్నె ఖయ్యిమ్‌ (స) ఇలా చెప్పారు: ఎవరైనా  ఒకవైపు దైవప్రవక్త (స) సంప్రదాయం మరియు సహాబాల విధానంన రెండో వైపు ప్రస్తుతం ముస్లింలు చేసే నిర్వాకాన్ని చూస్తే వారు ప్రవక్త (స) వారి సంప్రదాయానికి విరుద్ధంగా నడుచు కుంటున్నారన్న నిజం గ్రహిస్తారు. ఎందుకంటే -
అ) దైవప్రవక్త (స) సమాధుల వైపు తిరిగి నమాజు చేయకూడదని తాకీదు చేశారు. కాని వారు  సమాధుల వైపు తిరిగి  నమాజు చేస్తున్నారు.
ఆ) దైవప్రవక్త (స) సమాధులపై మస్జిద్‌ నిర్మాణం నిషేధించారు. కాని వారు సమాధులపై మస్జిద్‌లు, దర్గాలు నిర్మిస్తున్నారు.
ఇ) దైవప్రవక్త (స) సమాధులపై దీపాలు వెలిగించకూడదన్నారు. కాని వారు దీపాలు వెలిగిస్తున్నారు.
ఈ) దైవప్రవక్త (స) సమాధుల దగ్గర జాతర, ఉరుస్‌ చేయకూడదన్నారు. కాని వారు సమాధుల దగ్గర జాతర, ఉరుసులు, ప్రార్థనలు చేస్తున్నారు.
ఉ) దైవప్రవక్త (స) సమాధులను ఎత్తుగా చేయకూడదని, వాటిపై ఇల్లు వగయిరా కట్టకూడదన్నారు. కాని వారు మాత్రం సమాధులను ఎత్తుగా కట్టి గుంబద్‌లు నిర్మిస్తున్నారు. సమాధుల సందర్శనలోని అసలు ఉద్దేశ్యం:
 హజ్రత్‌ బురైదా (ర) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఓసారి ప్రజలతో ఇఆల అన్నారు: ఇంతకు ముందు నేను  మిమ్మల్ని  సమాధులను సందర్శించవద్దని వారించే వాణ్ణి. కాని ఇప్పుడు చెబుతున్నాను. మీరు సమాధులను సందర్శించండి. (ముస్లిం) 
  తిర్మిజీలో ఈ వాక్యం అదనంగా ఉంది: ''సమాధుల సందర్శనం పరలోకాన్ని జప్తికి తెస్తుంది. మరో చోట ఇలా ఉంది: ''ఈ సందర్శన ప్రాపంచిక వ్యామోహాన్ని తగ్గిస్తుంది''.

  ఇస్లాం ఆవిర్భవించిన తొలినాళ్ళలో దైవప్రవక్త (స)  తన అనుచరులను సమాధుల్ని సందర్శించవద్దని చెప్పారు. అనుచరులు కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారవటం చేత సమాధుల్ని సందర్శించినప్పుడు అజ్ఞానకాలపు భావోద్రేకాలకు లోనై షరీయతుకు విరుద్ధమయిన పనులు చేస్తారేమోనని ఆయన ఆందోళన చెందేవారు. అయితే తర్వాతి కాలంలో వారు ఇస్లామీయ సూత్రాల్ని బాగా ఆకళింపు చేసుకుని నికార్సయిన ముస్లింలుగా పరిణతి చెందిన తర్వాత ఆయనకు ఆ భయం పోయింది. అప్పుడాయన తన అనుచరులు సమాధుల్ని సందర్శించేందుకు   అనుమతినిచ్చారు. పైగా తరచూ 'సందర్శిస్తూ ఉండాల'ని తాకీదు చేశారు. తాము ఏదో ఒకనాడు మరణించేవారమేనన్న భావన  ప్రజల మనో మస్తిష్కాలలో మెదులుతూ ఉండాలన్నదే ఆయన ప్రవచనంలోని అసలుద్దేశ్యం. అంతేగాని సమాధుల వద్ద ఉరుసుల పేరుతో తమాషా చేయడానికి, మొక్కుకోవడానికి కాదు. ఈ రకమయిన చేష్టలకు షరీఅత్‌లో ఏ మాత్రం చోటు లేదు. 

అల్లాహ్‌కు భాగస్వాములు ఉన్నారా?




 దేవునికి సహచరుల్ని కల్పించి పూజించే ఆచారం దాదాపు అన్ని దేశాలలోనూ కనబడుతుంది. అవి సూర్య చంద్ర నక్షత్రాలయినా కావచ్చు, పాము వంటి విషపురుగులైనా అవ్వచ్చు, కుక్క, పంది, నక్క, గాడిద ఆకారాలయినా అవ్వచ్చు, అగ్ని, వాయువు, జలం అయినా కావచ్చు, దైవ దూతలు, జిన్నాతులు, మహనీయులు, దైవ ప్రవక్తల అయినా అవ్వచ్చు లేక భౌతిక పదార్థాలు, ఆధ్యాత్మిక సంబంధమైన పదార్థాలయిన అయివుండొచ్చు. ఇవన్నీ షిర్క్‌ కోవకు చెందినవే. ఇది ముమ్మాటికి విశ్వకర్త అయిన అల్లాహ్‌ా పట్ల విద్రోహం, తిరుగు బాటే. అందుకే దాన్ని మహా పాతకమని, ఘోర నేరమని, భయంకర పాపమని. క్షంతవ్వం కానిదని అభివర్ణించడం జరిగింది.

  'ఏమిటి? ఏ వస్తువునూ సృష్టించలేని వారినీ, వారే స్వయంగా ఒకరి చేత సృష్టించబడిన వారినా వీళ్ళు (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెడుతున్నది? వారు వీళ్ళకు ఏ సహాయమూ చేయలేరు కనీసం తమకు తాము కూడా ఏ సహాయం చేసుకోలేరు''.  (ఆరాఫ్‌:191,192)
  అంటే- క్రైస్తవంలో మాదిరి 'త్రిత్వం' (Trinity) సిద్ధాంతంగానీ, భారతదేశంలో వంటి 'త్రిమూర్తులవిశ్వాసంగానీమార్గం మరచిన   ముస్లింలలోనిదర్గాలుమనో రంజక ఊరేగింపులు, ఉరుసులు, సమాధుల  సమక్షంలో సజ్దాలు, సమాధుల్ని సిల్కు దుప్పట్లతో, పూలమాలలతో అలంకరించ డాలు, సమాధుల పట్ల ప్రజల్లో ఆసక్తి కలిగించేందుకు అక్కడ పాట కచేరీలు, ఖవ్వాలీలు, తుర్బత్‌లు, జాఫర్‌ మట్కాలు (జాఫర్‌ కె కుండె), జెండా తీయడాలు, సదింపులు, రొట్టెలు వదలడాలుగానీ - అన్నీ షిర్క్‌ క్రిందికే వస్తాయి. ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. షిర్క్‌ (బహు దైవారాధన), కుఫ్ర్‌ (దైవ తిరస్కారం, ధిక్కారం), ఇల్‌హాద్‌ (ధర్మరాహ్యిం) నాస్తికత్వం - షిర్క్‌లలోని అంతర్భాగాలే. అన్నింటిలోనూ ఒక్కటే భావం - దైవ విద్రోహం, అల్లాహ్‌ా పట్ల తిరుగుబాటు. చిన్న తేడా అంతే - బహుదైవారాధకులు ఇష్టమైన వాటిని దైవాలుగా, దేవునికి సహవర్తులుగా కొలుస్తారు. నాస్తికులు తామే దైవం అన్నట్టు వ్యవహరిస్తారు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:

''మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని మొర పెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే, మానవులే''. (ఆరాఫ్‌: 194)
  (ఓ ప్రవక్తా!) వారిని అడుగు: ''భూసముద్రాలపై అలుముకున్న చీకట్లలో నుండి మిమ్మల్ని రక్షించేవాడెవడుఆయన గనక మిమ్మల్ని  ఈ  ఆపద  నుండి  రక్షిస్తే మేము తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామని కడు దీనంగా లోలోపలే మీరు ఎవరిని వేడుకుంటారు? విపత్తు నుండి, అన్ని రకాల దుఃఖాల నుండి, బాధల నుండి మీకు విముక్తి నొసగేవాడు అల్లాహ్‌ాయే. అయినా సరే మీరు (మేలును మరచిపోయి) బహుదైవారాధనకు బరితెగిస్తున్నారు''.
(అల్‌ ఆరాఫ్‌: 63,64)
 ''ఎవరైతే అల్లాహ్‌ాను కాకుండా ఇతరులను సంరక్షకులుగా (భ్రమించి) ఆశ్రయించారో వారు, 'ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్‌ా సాన్నిధ్యానికి చేర్చడంలో తోడ్పతారని భావించి మేము వీళ్ళను ఆరాధిస్తున్నామ'ని తమ(వాదన)ల్ని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తారు''. (జుమర్‌: 3)
 
  బరి తెగించిన మరికొందరైతే - మనుషుల్ని చేసినందుకు దేవుడు సంతాపమునొంది నొచ్చుకున్నాడనీ, మానవులు తన శక్తి పరిధిని దాటి పోతున్నారనీ, దానికి మూలం చవారందరీ భాష ఒకటే అవ్వడం అనీ, అలానే వారిని వదిలేస్తే వారు ఎదిగిపోతారనీ వారికి ఏదీ ఆటంకం కాజాలదని భయపడి, వారి భాషను విడగొట్టాడనీ, భూమి మీద బాషలను తారుమారు చేసి వారిని చెదరగొట్టాడని, అప్పుడు మానవులు ప్రగతి చర్యలను మానుకున్నారని కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. వారు ఎంతటి అభాండాన్ని అల్లాహ్‌ా మీద మోపుతున్నారో వారికే తెలీదు. అల్లాహ్‌ా ఇట్టి ఊహాజనిత సిద్ధాంతాలకు అతీతుడు, పరమ పవిత్రుడు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:

  ''ఆకాశాలలో, భూమిలో ఉన్నవారంతా (తమ అవసరాలు తీరడానికి) ఆయన్నే అర్థిస్తున్నారు. ప్రతి దినం ఆయన ఓ (వినూత్న) వైభవంతో వెలుగొందుతూ ఉంటాడు''. (రహ్మాన్‌: 29)

 విశ్వమండలంలోని ఈ వ్యవస్థ ఉత్థాన పతనాల తెరల వెనుక క్రియాత్మక పాత్రను పోషించేది ఆ విశ్వకర్తే. ఆయన ప్రణాళికను అనుసరించే ఈ విశ్వ వ్యవస్థ   నడుస్తోంది. రేయింబవళ్ళలో ఏ ఒక్క క్షణం కూడా ఆయన ప్రమేయం లేకుండా ఏదీ జరుగదు. ఆయన అజరుడు, అమరుడు, నిత్యుడు, నిరంతుడుసజీవుడు.  సకల  చరాచర సృష్టికి  ఆయనే  మూలాధారం. ఆయన  ఆజ్ఞల పరిధి నుండి తప్పించుకు పారిపోయే శక్తి ఎవ్వరికీ లేదు.
  ''ఓ జిన్నులారా! ఓ మానవ సమూహానికి చెందినవారలారా! మీలో ఎవరికయినా భూమ్యాకాశాల అంచుల నుండి పారిపోయే శక్తి ఉంటే పారిపోయి చూడండి!''. (రహ్మాన్‌: 33)    
   అల్లాహ్‌ ఆజ్ఞల పరిధి నుండి పారిపోయే శక్తి ఎవరిలో ఉందనీ?! ఒకవేళ పారిపోయినా ఎందాక పోతారు? అల్లాహ్‌ అదుపులో లేని భూభాగం ఎక్కడుంది? మరి అట్టి సార్వభౌమాధికారి మానవులకు భయపడటమా? ఎంత విడ్డూరం! నిజం చెప్పాలంటే రంగుల వ్యత్యాసంగానీ, విభిన్న భాషలుగానీ ఆయన సూచనల్లోనివే.
 
అదే విధంగా - కొందరు దేవుని వీపుని (వెనుక పార్శ్యమును) చూచారని, కోందరు తమ స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా దైవంతో సంభాషించారని, దేవుడు ఆరు దినాల్లో భూమ్యాకాశాలను, సముద్రములను, వాటిలోని సమస్తాన్ని  సృజించి (అలసిసొలసి) విశ్రాంతి తిసుకున్నాడని, ఆ దినమే విశ్రాంతి దినమని, దేవుడు తన స్వరూపమందు ఆయన పోలికే చొప్పున నరులను చేశాడని, అప్పుడు మనిషి మంచీచెడ్డలను తెలుసుకుని దైవ స్థాయికి ఎదిగి పోయాడని, ఆయనలోని ఒకటి వంటివాడాయేను అని, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్షమును కూడా  తీసుకుని     తిని నిరంతరము జీవిస్తాడేమోనన్న బెంగ దైవానికి పట్టుకుందని....అందుకే ఆది మానవుడైన ఆదామును స్వర్గంలోకం నుండి వెళ్ళగొట్టడం జరిగిందని బల్లగుద్ది బాహటంగా, ఘంటారావంగా చెప్పుకు తిరిగేవారు నేటికి మానవ సమాజంలో ఉన్నారు అంటే  ఆశ్చర్యం  ఎంత  మాత్రం  కాదు. వారేదో నాస్తికులై ఉంటారనుకోకండి. వారు దైవం, ధర్మం మీద నమ్మకంతో జీవించేవారే. అధీ విచిత్రం!! ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
  ''ఏ మానవ మాత్రునితోనూ, అల్లాహ్‌ (ముఖాముఖిగా) సంభాషించడం అనేది జరగదు. వహీ (దివ్యావిష్కృతి) ద్వారా లేదా పరదా వెనుక నుంచీ లేదా ఒక దూతను పంపడం ద్వారా తప్ప''. (షూరా: 51)
  ''నిజానికి మీరు చాలా దారుణమైన విషయాన్ని, (ఘోరమైన నిందను) తెచ్చారు. (దైవం విషయంలో) వారు చేసే వాదన (ఎంత తీవ్రమైనదంటే) దాని కారణంగా ఆకాశాలు పగలి, భూమి బ్రద్దలై, పర్వతాలు తుత్తునియలైపోతాయేమో!''. (మర్యమ్‌: 89-92)

  అంటే - వారి ఈ విధమైనటువంటి అపవాదుకు మిన్ను విరిగి మీద పడవచ్చు.  భూమి భయంకరంగా ప్రకంపించవచ్చు. పర్వతాలు బద్దలైపోవచ్చు. వాస్తవం ఏమిటంటే - ''ఆకాశాలలో, భూమిలో ఉన్న వారందరూ కరుణామయుని వద్దకు దాసులుగా రావలసిందే. వారందరినీ ఆయన చుట్టు ముట్టి ఉన్నాడు. అందరినీ పూర్తిగా లెక్క పెట్టి ఉంచాడు. వారంతా ప్రళయ దినాన ఆయన సమక్షంలో ఒంటరిగా హాజరవుతారు''. (మర్యమ్‌: 93-95)
  దైవాన్ని ప్రత్యక్షంగా చూస్తేగానీ విశ్వసించము అన్న వాదనలు కొన్ని మనకు కన్పిస్తాయి, విన్పిస్తాయి. ఇకపోతే దైవాన్ని ప్రత్యక్షంగా చూడాలన్న ఆకాంక్ష ఆది నుండి ప్రతి మనిషిలోనూ ఉంది. ఇదే విషయాన్ని ప్రవక్త ముసా (అ) అల్లాహ్‌తో విన్నవించు కున్నప్పుడు ఆ పరమోన్నత ప్రభువు ఇలా సమాధానమిచ్చాడు.

అతను (మూసా) ''నా ప్రభూ! నాకు నీ దర్శన భాగ్యం కల్పించు. నేను ఓసారి నిన్ను చూసి తరిస్తాను'' అని విన్నవించుకోగా, ''ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు నన్ను చూడలేవు'' అయితే అదిగో! ఆ కొండ వైపు దృష్టిని సారించు. అది గనక యధాస్థితిలో ఉండగలిగితే నువ్వు నన్ను చూసే ఆస్కారం ఉంటుంది''. అని ఆయన సెలవిచ్చాడు. ఆ తర్వాత అతని ప్రభువు తేజస్సును ఆ కొండపై ప్రసరించగానే ఆ తేజస్సు దాన్ని తుత్తునియలు చేసేసింది. అంతే మూసా స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహలోకి రాగానే, (ప్రభూ!) ''నీవు పరమ పవిత్రుడవు. నేను నీ సన్నిధికిలో పశ్చాత్తాప పడుతున్నాను. అందరికన్నా ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నాను'' అని మనవి చేసుకున్నాడు''. (ఆరాఫ్‌: 143)
  అంటే-  ఓ అల్లాహ్‌!  నీ ఔన్నత్యాన్ని, నీ శక్తిని అంగీకరి స్తున్నాను. నేను ఆశక్తుణ్ణనీ, ఇహలోకంలో నిన్ను చూడగలిగే శక్తి నాలో లేదు. మరే మానవుడునూ నిన్ను చూడజాలడు అని గ్రహించాను అన్నది మూసా (అ) మాటల్లోని ఆంతర్యం.
 
అనగా ఇహలోకంలో ఎట్టి పరిస్థితిలోనూ, ఎవరునూ, ఎప్పుడునూ ఆయన స్వరూపమును చూడలేదు. ఇహలోకంలో అల్లాహ్‌ాను భౌతిక నేత్రాలతో చూసే శక్తి ఎవరికీ లేదు కూడా. మరి దైవాన్ని మనం ఎన్నటికీ చూడలేమా? అనంటారా! ఇహలోకంలో మాత్రం ఖచ్చితంగా చూడలేము. అయితే పరలోకంలో అల్లాహ్‌ా ప్రసన్నతను పొంది ఆయన కృపాకటాక్షాలతో స్వర్గానికి వెళ్ళే సౌభాగ్యవంతులు ఆయన్ను దర్శించుకుంటారు. అల్లాహ్‌ా తన దర్శనభాగ్యం నిమిత్తం  వారి కంటి చూపులో మరింత శక్తినిస్తాడు. తత్ఫలితంగా కళ్ళు దైవ దర్శన జ్యోతికి తట్టుకోగలుగుతాయి. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కోంటంది: ''ఆ రోజు ఎన్నో ముఖాలు (ఆహ్లాదంగా) తాజాగా దేదీప్యమానంగా (మెరిసిపొతూ) ఉంటాయి. తమ ప్రభువు దర్శనాభాగ్యంతో తాదాత్మ్యం చెందుతుంటాయి''. (ఖియామహ్‌: 22,23)
 
  విశ్వాసుల ముఖాలు తమ సత్పరిణామం పట్ల హర్షాతిరేకంతో విప్పారుతాయి. వారి చెంపకెంపులు కాంతిలీనుతూ ఉంటాయి. దానికి తోడు దైవదర్శన భాగ్యం వల్ల వారి ఆనందానికి అవధులు ఉండవు. ఎంత వరకంటే -, ఒకే ఒక్క దైవ దర్శనంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి కానీ వారికి స్పృహే ఉండదు. స్వర్గ సౌఖ్యాలను రుచి చూశాక, భూలోక కష్టాలను, సుఖమయ జీవితాన్ని మరచిపోయిన విశ్వాసులు, దైవదర్శనంతో స్వర్గ సౌఖ్యాలనే మరచిపోతారు. ఎంత మనోహరం ఆ దృశ్యం!!

  అట్టి హమహోన్నత ప్రభువు దర్శనంతో తరించాలనుకుంటున్నారా? అయితే ఆయన ఏమంటున్నాడో వినండీ!
''కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవారు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో ఏ ఒక్కరికీ భాగస్వామ్యం కల్పించకూడదు''. (కహఫ్‌: 110)
 
  అంటే - సత్కార్యం మనిషి ఐహిక జీవితాన్ని శాంతిమయం చేస్తే, ఏకదైవారాధన మనిషి పరలోక జీవితాన్ని సఫలీకృతం చేస్తుంది. దీనికి భిన్నంగా దుష్కర్మలు మనిషి ఐహిక జీవితాన్ని నరకప్రాయం చేస్తే, షిర్క్‌, బహుదైవారాధన మనిషి పరలోక జీవితాన్ని  సర్వనాశనం చేస్తుంది. కారుణ్య ప్రభువైన అల్లాహ్‌ా ఈ దుష్టపోకడల నుంచి మనందరినీ రక్షించుగాక! (ఆమీన్‌).



Monday, 10 March 2014

తీర్చి దిద్దిన తీరు చూడు!


మహా ప్రవక్త ముహమ్మద్‌ (స ) ప్రజల జీవితాలను తీర్చి దిద్దటానికి, ఆంతర్యాలను పరిశుద్ధ పరచటానికి పూనుకున్నప్పుడు రకరకాల జనులు ఆయన (స ) ముందున్నారు. ధనికులతోపాటు పేదవారు కూడా ఉన్నారు. పండితులతో పాటు పామరులు కూడా ఉన్నారు. నాగరికులతో పాటు అనాగరికులు కూడా ఉన్నారు. మానవ మహోపకారి  అయిన ప్రవక్త (స ) అందరినీ శ్రద్ధగా గమనిస్తూ ఉండేవారు. వారి  పరిస్థితిని బట్టి విషయం అర్థమయ్యేలా చెప్పేవారు.

ఒక న్యూ ముస్లిం

ముఆవియా బిన్‌ హకమ్‌ సులమీ ప్రవక్త సహచరులలో ఒకరు. ఈయన అప్పుడప్పుడే ఇస్లాంలో చేరిన న్యూ ముస్లిం సహాబీ. అంతకు ముందు ఆయన ఇస్లాం మర్యాదలను గురించి విని ఉన్నారు. ఎవరయినా తుమ్మి 'అల్‌హమ్దులిల్లాహ్‌ా' అని పలికినపుడు, దానికి జవాబుగా 'యర్‌హముకల్లాహ్‌ా' అని చెప్పటం ధర్మం అన్న విషయం ఆ న్యూ ముస్లిం సహాబికి తెలుసు. సామూహిక నమాజు వేళ కాగానే అందరూ నమాజుకు ఉపక్రమించారు. ఆ న్యూ ముస్లిం సహాబి కూడా అందరితో కలిసి నమాజుకు నిలబడ్డారు. నమాజు మధ్యలో ఎవరికో తుమ్ము వచ్చింది. అంతే! దానికి సమాధానంగా ముఆవియ (ర ) 'యర్‌హముకల్లాహ్‌!' అని బిగ్గరగా అనేశారు. కొంతమంది సహాబా ఆయన్ని తీక్షణంగా చూశారు. 'అదేంటీ, మీరంతా నన్ను అలా చూస్తారేమిటి?' అని ముఆవియ (ర ) నమాజులోనే అడిగేశారు. అప్పుడు సహాబీలలో కొందరు కాళ్ళపై చేతులు చరిచి 'సుబ్‌హానల్లాహ్‌' అన్నారు. 'ఓహో! నమాజులో ఇలా మాట్లాడకూడదు కాబోలు' అనుకుని మౌనం వహించారు ముఆవియా.

  సలాం చెప్పి నమాజు ముగించిన తర్వాత దైవప్రవక్త (స ) వెనుతిరిగి,  ''నమాజు మధ్యలో మాట్లాడిందెవరు?'' అని అడిగారు. జనులంతా ముఆవియా వైపు సైగ చేశారు.
 
  ఆ సన్నివేశాన్ని ముఆవియ (ర ) మాటల్లోనే దర్శించండి - ఆయన ఇలా అన్నారు: ''నా తల్లిదండ్రులను దైవప్రవక్త (స ) కు అర్పింతు! నేను ప్రవక్త (స ) వారిని మించిన సంస్కర్తను అంతకుముందుగానీ, ఆ తర్వాత గానీ ఎక్కడా చూడలేదు. ఆయన (స ) నన్ను కోప్పడలేదు సరి కదా, ఆప్యాయంగా నన్ను దగ్గరకు పిలిచి, ''ఇది నమాజు నాయనా! నమాజులో మాట్లాడకూడదు కదా! నమాజులో ఖుర్‌ఆన్‌ పఠించ బడుతుంది. దైవనామం స్మరించబడుతుంది. దైవ కీర్తన జరుగుతుంది'' అని మాత్రం సుతిమెత్తగా చెప్పారు.

ఆ పిలుపు ఎవరిది?


Shanti priya

ప్రతి శిశువు పుడుతుంది ప్రకృతి
ధర్మంపై నీవు ప్రకృతిగా, నేను ప్రకృతిగా
ఏకేశ్వరోపాసకులైతే అదే తౌహీద్‌
సహవర్తులనీ, శక్తులనీ, భాగస్తులనీ
ప్రతి వస్తువును మ్రొక్కితే అదే షిర్క్‌

వర్ణ భేదం వర్గ వైషమ్యం కులతత్వం
అస్పృశ్యం అంటరానితనం వద్దు వద్దని
చంచలత్వం, లోభత్వం మోహ భుక్తం
వలదు వలదని అరచినా గీపెట్టినా వినదు
ఈ లోకం, రాళ్ళు రువ్వును పైశాచికం

విశ్వ జనుల్లారా! గ్రంథ ప్రజల్ల్లారా!! రండి
మనందరి మధ్య సమైక్యమైన సిద్ధాంతం వైపునకు
'అల్ల్లా నఅబుద ఇల్లల్లాహ్‌ా వలా నుష్రిక బిహి
షైఅ, వలా యత్తఖిజ బాజునా బాజన్‌ అర్‌బాబమ్‌
మిన్‌ దూనిల్లాహ్‌ా!!!'1 అంటూ మిథ్యా భక్తుల మీద
మండి పలికిన ప్రవక్త ప్రవచనం నిజం, మారని ఇజం.

నేలకందిన ఆ పిలుపు నింగిపై నుంచి
విన్పించెను. మతం చాటునున్న బూజు దులిపెను
జనులు గీసిన వృత్తాలు దాటీ, ఒక్క పలుకే
ఉక్కు పిలుపై అవని మొత్తం మారుమ్రోగెను
ప్రజలపై పడివున్న ఆంక్షల బరువులు దించెను
పాలితులలో, శ్రామికులలో సత్య చేతన బీజం నాటిన
సత్య, సస్య విప్లవ దీప్తులందరిలో ముహమ్మద్‌ (స) చిట్టచివరి ప్రవక్త.

సభ్యతకు, సంస్కారానికి ఆదిలోనే
అండగా నిల్చి ఊతమిచ్చి నడిపినవారే ప్రవక్తలు
ఆటవికమైన అమానుషమైన అలనాటి ఆ
దర్వ్యవస్థ దుమ్ము దులిపి ధర్మ ఢంకా
మ్రోగించిన మహోజ్వల క్రాంతికారులు ప్రవక్తలు


ఆ జనని ఆ అరబ్బు అవని
అన్య దురాచారాక్రమితయై
నిజం దాగీ, సత్యం సమసీ
అసత్యం ప్రబలి, అధర్మం వెర్రి తలలు వేసే
దృశ్యం చూసి ఎంత కాలమని దాస్యం
సాగించవలెను సత్యాన్వేషణని ఒక
అమీన్‌ సాదిఖ్‌ పిలుపునిచ్చెను విశ్వ ధాత్రిని
తట్టి లేపెను.

ఆ మాట ఆణిముత్యంగా
ఆ ప్రబోధనం అక్షర సత్యంగా
ఆ ప్రవచనం నవ నినాదంగా
అదేె ధర్మం అదే మోక్షంగా
పల్లెపల్లెను పట్టణాలను మఠాలను
మతాధిపతులనూ సంకుచిత సంకెళ్ళు త్రెంచి
స్వతంత్ర భానులుగా సాత్వికులుగా కదలి
రమ్మని పిలుపునిచ్చెను

 ప్రబోధించిన ప్రవక్త ఒక్కరే; అధర్మం
నశించి, మృగత్వం మెడలు వంచి మానవత్వం
జయించింది. అస్తమించిన స్వేచ్ఛా వాయువులు
సత్య సుగంధాలు వెదజల్లనారంభించాయి
గిరులు, ఝరులు నింగి నేలా శాంతి తంత్రి నినదించాయి
విశ్వంలో కాంతిని, విశ్వ జనుల్లో శాంతిని నింపాయి
అదిగో విశ్వ కారుణ్యమూర్తి అంటూ శ్రేయ శంఖం పూరించాయి



1- ''మనం అల్లాహ్‌ను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు. ఆయనకు సాటి కల్పించకూడదు. మనలో ఎవరూ అల్లాహ్‌ాను తప్ప ఇతరుల్ని ప్రభువుగా స్వీకరించకూడదు''. (ఆలి ఇమ్రాన్‌: 64)




Wednesday, 5 March 2014

మూడు ప్రశ్నలు మూడు సమాధానాలు


సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ

ఈ ప్రపంచం అనేక మతాల. సమాజాల, జాతుల, తెగల కూడలి. ఇక్కడ క్రైస్తవులూ ఉన్నారు, యూదులూ ఉన్నారు, హిందువులూ  ఉన్నారు, సాబియీలూ ఉన్నారు, ఫారసీయులూ ఉన్నారు, నాస్తికులూ ఉన్నారు,  ఆస్తికులూ ఉన్నారు, లౌకిక వాదులూ ఉన్నారు, ముస్లింలూ ఉన్నారు. ఈ ప్రపంచంలో అనాది నుండి మనిషి ఎదుర్కొంటున్న ప్రశ్నల్లో ముఖ్యమైనవి మూడు. ఈ ప్రశ్నలు నాటి నుండి నేటి వరకూ మానవ మేధను పరీక్షిస్తూనే వస్తున్నాయి. నేడు సయితం అనేక మంది మేధావులు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం వెతకడంలో తలమునకలై ఉన్నారన్నది వాస్త వం. మానవ జీవితంలో కీలక పాత్ర పోషించే ఆ మూడు ప్రశ్నలు -

1) మనం ఎక్కడ నుంచి వచ్చాము? 
2) మనం ఎందు కోసం వచ్చాము?
3) చివరి మన గమ్యస్థానం ఏది? 

ఇప్పుడు మీ వంతు. ఈ మూడు ప్రశ్నలకు మీ మేధ ఏం సమాధానం చెబుతుందో కాసేపు చదవడం ఆపి ఆలోచించండి. ఈ మూడు ప్రశ్నలకు ముందు మీరు సమాధానం తెలుసు కునేందుకు ప్రయత్నించండి. ఆ సమాధానం సరైనది-సహేతుకం కావచ్చు, నిర్హేతుకం కావచ్చు. ఎలా ఉన్నా పర్వా లేదు ఆలోచించండి. మీకు కాస్త సమయం ఇవ్వబడుతోంది.
జ)...............................................................................................................................................................................................................
జ).........................................................................................................................................................................................................................................................
జ)...............................................................................................................................................................................................................
మానవ సమాజంలోని అనేక మంది పండితా గ్రేసరులకు అంతుబట్టని ఈ మూడు ప్రశ్నల కు ఇస్లాం సంపూర్ణ సమాధానం - సూటిగా, ప్రతి మనిషి మనసులో దిగబడేలా, స్పష్టంగా, ప్రతి వ్యక్తి మేధకు అర్థమయ్యేలా బోధ పరు స్తుంది. అదెలాగా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ పూర్తి వ్యాసం చదవాల్సిందే!

1) మనం ఎక్కడ నుంచి వచ్చాము? 

జ)''నిశ్చయంగా మేము మనిషిని మట్టి సారం తో సృష్టించాము''.(అల్‌ మోమినూన్‌: 12-14)
 మట్టితో సృజించడం అంటే ఆది మానవుడైన ఆదం (అ)ను మట్టితో చేయడం. మనందరికి మూల పురుషుడు హజ్రత్‌ ఆదం(అ) అయితే, ఆయన మూలం మట్టి.  తర్వాత ఏం జరిగింది?

'అలస్తు' ప్రమాణం
'నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, స్వయంగా వారినే   వారికి సాక్షులుగా పెట్టి, 'నేను మీ ప్రభువుని కానా?' అని అడిగినప్పుడు- 'ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం' అని వారు చెప్పారు.' (అల్‌ ఆరాఫ్‌: 172)

 పై పేర్కొనబడిన సంఘటన 'అలస్తు ప్రమా ణం'గా సుప్రసిద్ధం. దీని వివరాలు ఒక హదీసులో ఉన్నాయి. ''....ఆదం వీపు నుండి, ఆయనకు పుట్టబోయే సంతానమంతటిని ఒక్క సారిగా వెలికి తీసి, వారిని 'అలస్తు బిరబ్బి కుమ్‌? - నేను మీ ప్రభువుని కానా?' అని ప్రశ్నించాడు. 'బలా షహిద్‌నా' - నువ్వే మా ప్రభువువి. దీనికి మేమంతా సాక్షులం' అని వారు బదులిచ్చారు''. (ముస్నదె అహ్మద్‌)
  ఇది ఏ లోకంలో జరిగింది?   ఇది 'ఆలమె జర్ర్‌'- పరమాణువుల లోకం అనబడుతుంది. మొత్తం మీద ఈ సృష్టికి కర్త ఉన్నాడు, ఆయన ఒక్కడే అన్న భావన ప్రతి మనిషి నైజంలోనూ   ఇమిడి ఉంది. ఈ ప్రకృతి సిద్ధ భావాన్నే మహా ప్రవక్త (స) ఈ విధంగా స్పష్ట పర్చారు: ''పుట్టే ప్రతి శిశువు సహజత్వం (ప్రకృతి నైజం) పైనే పుడుతుంది. కాకపోతే  దాని తల్లిదండ్రులు ఆ శిశువును యూదుని గానో, క్రైస్తవునిగానో, మజూసీగానో మార్చి వేస్తారు. జంతువు ఈనినప్పుడు దాని పిల్ల సయితం సురక్షితంగా ఉంటుంది. దాని ముక్కుగానీ, చెవులగానీ కోయబడి ఉండవు''. (సహీహ్‌ బుఖారీ)

 ఆది మానవుడైన ఆదం మట్టితో సృజించ బడ్డారు అంటే మనమంతా అదే రీతిన మట్టి తోనే పుడుతున్నామా అంటే కాదు అన్నది సమాధానం. మరి మన పుట్టుక ప్రక్రియ ఎలా జరుగుతుంది? అంటారా. చూడండి: ''మరి మిమ్మల్ని మట్టితో మేమే సృష్టించాము. ఆ తర్వాత వీర్యపు బొట్టుతో, ఆపైన గడ్డకట్టిన రక్తంతో, అటుపిమ్మట మాంసం ముద్దతో చేశాము. అప్పటికీ అది రూపం కలదిగానూ, రూప రహితమైనదిగానూ ఉన్నది. మేము మీకు సృష్టి రహస్యాలు తెలియజెప్పేందుకు (ఇదంతా చేస్తున్నాము).  మరి మేము  కోరిన దానిని నిర్ధారిత సమయం వరకు మాతృ గర్భాలలో ఉంచుతున్నాము. ఆ తర్వాత మిమ్మల్ని శైశవ థలో బయటికి తీస్తాము. మరి మీరు నిండు యౌవనానికి చేరుకోవ టానికి మీలో కొందరు (యుక్త వయసుకు చేరుకోక ముందే) మృత్యువుకు గురి చేయ బడతారు. మరి కొందరు అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ గ్రహించలేనంత నికృష్టమైన వయస్సుకు చేర్చబడతారు''. (అల్‌ హజ్జ్‌: 5)
 ''నిశ్చయంగా మేము మనిషిని మట్టి సారం తో సృష్టించాము. ఆ తర్వాత అతన్ని వీర్య బిందువుగా చేసి ఓ సురక్షితమై చోటులో (లోకం మొత్తంలో శిశువు కోసం మాతృ గర్భంకన్నా సురక్షితమైన చోటు మరొకటి లేనేలేదు) నిలిపి ఉంచాము. మరియు ఆ వీర్య బిందువును ఘనీభవించిన రక్తంగా చేశాము. మరి ఆ రక్తపు గడ్డను మాంసపు ముద్దగా మార్చాము. దరిమిలా ఆ పిండాన్ని ఎముకలు గా చేశాము. పిదమ ఆ ఎముకలకు మాంసం తొడిగించాము. అటుపిమ్మట దాన్ని పూర్తి భిన్నమైన సృష్టిగా ప్రభవింపజేశాము. అందరి కన్నా ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్‌ా ఎంతో శుభకరుడు''. (అల్‌ మోమినూన్‌:12-14)
''మేము మానవుణ్ణి అందమైన-అత్యుత్తమమైన ఆకృతిలో సృజించాము'' (అత్తీన్‌:4) అన్న దివ్వ సూక్తి దృష్ట్యా- మానవ జన్మ అపురూప మైనది. ఇలాంటి సృజన కేవలం ఒక్క  అల్లాహ్‌ాకు మాత్రమే సాధ్యం. ప్రపంచంలోని వస్తు నిర్మాతలెవరూ ఇలాంటి సృష్టి ప్రక్రి యను సాగించలేరు అని తెలుస్తుంది.

మరి ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది? అని ఆలోచిస్తున్నారా?! సూరయె సజ్దాలో ఇలా సెలవియ్యబడింది:
  ''ఆయన ఏ వస్తువు చేెసినా చాలా చక్కగా చేశాడు. మానవ సృష్టిని మట్టితో మొదలు పెట్టాడు. ఆతర్వాత అతని సంతతిని అత్యంత అల్పమైన నీటి సారం (వీర్యం)తో కొనసాగిం చాడు. ఆ పిదప తగు రీతిలో దానిని మలచి, అందులో తన వద్ద నుండి ఆత్మను ఊదాడు. మరి ఆయనే మీ చెవులను, కళ్ళను, హృద యాలను చేసాడు. (అయినా) మీరు కృతజ్ఞ   తలు తెలుపుకునేది చాలా తక్కువే''. (అస్సజ్దహ్‌: 7-9) ''సుదీర్ఘమైన కాలంలో మానవుడు చెప్పుకోదగ్గ వస్తువుగా లేకుండిన సమయం ఒకటి గడవ లేదా? నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షి ంచడానికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము. మరి మేము అతన్ని వినే వాడుగా, చూసేవాడుగా చేశాము''. (దహర్‌: 1,2)

 ఆ వీర్య బిందువు ఎక్కడ తయారవుతుంది అంటే- అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ''ఇక మానవుడు తాను దేంతో పుట్టించబడ్డాడో చూసుకోవాలి. అతను ఎగిసిపడే నీటితో పుట్టించబడ్డాడు. అది (పురుషుని) వెన్ను ముక, (స్త్రీ) ఛాతి భాగం మధ్య నుండి వెలు వడుతుంది''. (తారిఖ్‌: 5,6)
  ఇవి, ఇటువంటి అనేక ఆయతుల ద్వారా స్పష్టమయ్యేది ఏమిటంటే, ఒకప్పుడు మనిషిపై ఏమి కాని శూన్య థ కూడా ఒకటి ఉండేది. అల్లాహ్‌ా అతన్ని శూన్య స్థితి నుండి మట్టితో, తర్వాత నీటి సారంతో, తర్వాత పై పేర్కొన్న విధంగా పుట్టించాడు. అంటే మనిషి ఉనికి ఏదో యాదృచ్చిక విస్పోటనం వల్ల జరగలేదు, మనిషిని, సకల సృష్టతాలను పుట్టించినవాడు అల్లాయేనని తెలుస్తుంది. అంటే మనిషి అసలు స్థితి ఏమిటో, అతని ఉనికి ఎలా ప్రారంభమై, ఏ విధంగా పూర్ణ స్థాయికి చేెరు కుందో సమాధానం లభించింది. మరి ఎంతో మహోత్కృష్టమైన మానవ సృష్టి ఎందు నిమిత్తం జరిగింది అంటే  ''మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) సృష్టిం చామనీ, మీరు మా దగ్గరకు మరలిరావడ మనేది   జరగని పని అని భ్రమపడుతు న్నారా?'' (అల్‌మోమినూన్‌:115)
 ''(ఆ విషయానికొస్తే) మేము భూమ్యాకాశాల ను, వాటి మధ్యనున్న వాటిని-ఏ ఒక్కటిని లక్ష్యరహితంగా పుట్టించ లేదు. (యాదృచ్చికంగా పుట్టాము అంతే) అన్నది అవిశ్వాసుల- నాస్తికుల భ్రాంతి మాత్రమే''. (స్వాద్‌: 27)
  ఈ దివ్య సూక్తులలో మనిషిని పుట్టించిన అల్లాహ్‌ ఇతర సృష్టితాల మాదిరిగానే అతని జీవితానికి సయితం ఒక  లక్ష్యం పెట్టాడని తెలుస్తోంది.

2) మనం ఎందు నిమిత్తం వచ్చాము? మన జీవిత లక్ష్యమేమిటి?

  మనం ఒక కలమును తయారు చేస్తాము. రాయడం దాని లక్ష్యంగా పెడతాము. అంటే కలం ఉత్పత్తిదారులమైన మనం దాని లక్ష్యా న్ని నిర్ధారించినట్లే మనల్ని శూన్యం నుండి ఉనికిలోకి తీసుకు వచ్చిన దేవుడే మన జీవిత లక్ష్యాన్ని ఖరారు చేయాలి. అలా జరిగిందా? అంటే, చూడండి:  ''నేను జిన్నాతులను, మానవులను సృష్టిం చింది వారు నన్ను ఆరాధిండానికి మాత్రమే. నేను వారి నుండి జీవనోపాధి (వజ్ర వైఢూ ర్యాలు, బంగారు వెండి ఆభరణాలు, వాహన, నివాస సౌకర్యాల)ని కోరడం లేదు. వారు నాకు అన్నపానీయాలు (నైవేద్యాలు) పెట్టాలని కూడా నేను కోరడం లేదు. నిశ్చయంగా అల్లాహ్‌ాయే సకల జీవరాసులకీ స్వయంగా ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహా శక్తిశాలి, మహాబలుడు''. (జారియాత్‌: 56- 58)

మానవులను, జిన్నాతులను పుట్టించడంలోని తన ఉద్దేశ్యమేమిటో అల్లాహ్‌ా ఈ వాక్యాలలో విశద పర్చాడు. వారంతా తనను మాత్రమే ఆరాధించాలి, తనకు మాత్రమే విధేయత చూపాలన్నది ఆ విశ్వకర్త అభిమతం. అయితే దాని కోసం ఆయన మనుషులను గానీ, జిన్నాతులనుగానీ కట్టుబానిసలుగా చేయలేదు. వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించలేదు. ఒకవేళ అదే గనక అయి వుంటే- మనుషులు, జిన్నాతులు తమకు ఇష్టం ఉన్నా, కష్టం ఉన్నా ఏకదైవారాధనకు  చచ్చినట్టు కట్టుబడి ఉండేవారు. కానీ అల్లాహ్‌ా వారికి పరిమిత స్వేచ్ఛ ఇస్తూనే తనను ఆరాధించమని కోరాడు. వారి పుట్టు కలోని పరమార్థాన్ని, వారి జీవిత లక్ష్యాన్ని వారికిక్కడ జ్ఞాపకం చేెశాడు. అంతే కాకుం డా, తనకు ఎలాంటి ఉపాధి అవసరం గానీ, గుడి, గోపుర ఆవశ్యకతగానీ, నగానట్రా అవ సరంగానీ లేదని, తనకు నైవేద్యాల, ఆహార పానీయాల అవసరం అంత కన్నా లేదని ఉద్ఘాటించాడు. పైగా తానే సకల జీవరాసుల కు ఉపాధిని ప్రసాదిస్తున్నానని కూడా స్పష్ట పర్చాడు. అంటే మనం 'తిన్నామా, పడుకు న్నామా, తెల్లారిందా' అన్నట్టు లక్ష్యరహితం గానూ పుట్టలేదు. అలాగే దైవం పేరు చెప్పు కొని గుళ్ళుగోపురాలు కట్టి, వజ్రవైఢూర్యా లు, బంగారు వెండి ఆభరణాలు సమర్పిం చడానికి లేదా కూడ బెట్టుకోవడానికీ పుట్ట లేదు. మన పుట్టుక కేవలం మనందరి సృష్టి కర్త అయిన అల్లాహ్‌ాను మాత్రమే ఆరా ధించే నిమిత్తం జరిగింది.

3) చివరి మనందరి గమ్యస్థానం ఏది?

''ఓ మానవుడా! నువ్వు నీ ప్రభువును చేరుకునే వరకూ ఈ సాధనలో (ఈ కఠోర పరిశ్రమలో) నిమగ్నుడవై ఉండి, తుదకు ఆయన్ను చేరు కుంటావు''. (ఇన్షిఖాఖ్‌: 6)
  ''సృష్టి (ప్రక్రియ)ని మొదలెట్టేవాడు అల్లాహ్‌ాయే. మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. మరి మీరంతా ఆయన వైపున కే మరలించ బడతారు''. (రూమ్‌:11)
  ''మరి మీరంతా మరలిపోవలసింది మీ ప్రభువు వైపునకే. మీరు చేస్తూ ఉన్న కర్మలను ఆయన మీకు తెలియపరుస్తాడు. ఆయన ఆంతర్యాల్లోని విషయాల్ని సయితం ఎరిగినవాడు''. (జుమర్‌: 7)
 ''కడకు అందరూ పోయి చేెరవలసింది నీ ప్రభువు వద్దకే! మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడ్పిస్తున్నాడు. మరి  ప్రాణం తీసే వాడు ఆయనే, ప్రాణం పోసేవాడూ ఆయనే. ఇంకా ఆయనే జంటల ను- ఆడ- మగలను సృజించాడు''. (అన నజ్మ్‌: 42-45)
''నిశ్చయంగా (అందరూ) మరలిపోవలసింది నీ ప్రభువు సన్నిధికే''. (అలఖ్‌: 8)
  ఇంత చేెసిన దేవుడు మనిషి ఎలా జీవించాలో చెప్పలేదా? అంటారా. చూడండి: ''మేము అతని (మానవుని)కి మార్గం కూడా చూపాము. ఇక అతను కృతజ్ఞుడుగా వ్యవహరించినా లేక కృత ఘ్నుడుగా తయారైనా (వాడి ఇష్టానికే వదిలేశాము). అయితే, అవిశ్వాసుల కోసం మేము సంకెళ్ళు, ఇనుప పట్టాలను, జ్యలించే అగ్నిని సిద్ధం చేెసి ఉంచాము. (తత్భిన్నంగా) నిశ్చయంగా సజ్జనులు (విశ్వాసులు) 'కాఫూర్‌' కలుపబడిన మధుపాత్రను సేవిస్తారు. అదొక సరోవరం. దైవ దాసులు దాన్నుండి (తనివి తీరా) త్రాగుతారు. (తాము కోరిన చోటికి) దాని పాయలు తీసుకుపోతారు''. (అల్‌ ఇన్సాన్‌: 3-6)

 అభిమాన సోదరులారా! అల్లాహ్‌ మనల్ని అందమైన ఆకృతిలో పుట్టించి, శక్తియుక్తులు అనుగ్రహించి మన మానాన మనల్ని ఇట్టే వదలి పెట్టలేదు. మానవ జీవిత లక్ష్యాన్ని ఎరుకపర్చడమేకాక, ఆ లక్ష్య సాధనకు పని కొచ్చే మనందరి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం గొప్ప ఏర్పాటు కూడా చేశాడు. తన ప్రవక్తల ద్వారా, తన గ్రంథాల ద్వారా సన్మార్గమేదో, దుర్మార్గమేదో చక్కగా వివరించాడు. ఆ పరంపరలో వచ్చిన చిట్ట చవరి గ్రంథం పవిత్ర ఖుర్‌ఆన్‌ అయితే కట్ట కడపటి దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స). ఇక మనం దైవ విధేయతా మార్గాన్ని అవలంబించి ధన్యజీవులుగా నెగ్గుకొస్తామో లేక అప మార్గాల్ని అనుసరించి అల్లాహ్‌ మనకు చేసిన అనేక మేళ్లను మరచి బ్రతికి ఇహపర జీవితాల్ని మరింత దుర్భరం చేెసుకుంటామో మన ఇష్టాయిష్టాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్నే దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా బోధ పర్చారు: ''ప్రతి వ్యక్తీ తన అంతరాత్మను క్రయ విక్రయాలకై పెడతాడు. ఈ వర్తకంలో అతడు దాన్ని చంపినా చంపేస్తాడు. లేదా దానికి స్వేచ్ఛనయినా ప్రసాదిస్తాడు''. (సహీహ్‌ బుకారీ)
అంటే మనం మన దుష్కర్మల ద్వారా మన అంతరాత్మ గొంతు నులిమివేయటమో లేక దాని గౌరవాన్ని కాపాడటమో చేస్తాం అన్న మాట. మనం ఒకవేళ దురాగతాలకు పాల్పడితే మన అంతరాత్మను చంపుకున్నట్లే. ఒకవేళ మనం సత్కార్యాలు చేెస్తే మన అంతరాత్మకు శాంతిని, ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించిన వాళ్ళమవుతాము. ఓ వర్గం స్వర్గానికి! మరో వర్గం నరకానికి!! ఎటు వెళ్ళాలో మనమే నిర్ణయించుకోవాలి సుమా!!!