మహా ప్రవక్త ముహమ్మద్ (స ) ప్రజల జీవితాలను తీర్చి దిద్దటానికి, ఆంతర్యాలను పరిశుద్ధ పరచటానికి పూనుకున్నప్పుడు రకరకాల జనులు ఆయన (స ) ముందున్నారు. ధనికులతోపాటు పేదవారు కూడా ఉన్నారు. పండితులతో పాటు పామరులు కూడా ఉన్నారు. నాగరికులతో పాటు అనాగరికులు కూడా ఉన్నారు. మానవ మహోపకారి అయిన ప్రవక్త (స ) అందరినీ శ్రద్ధగా గమనిస్తూ ఉండేవారు. వారి పరిస్థితిని బట్టి విషయం అర్థమయ్యేలా చెప్పేవారు.
ఒక న్యూ ముస్లిం
ముఆవియా బిన్ హకమ్ సులమీ ప్రవక్త సహచరులలో ఒకరు. ఈయన అప్పుడప్పుడే ఇస్లాంలో చేరిన న్యూ ముస్లిం సహాబీ. అంతకు ముందు ఆయన ఇస్లాం మర్యాదలను గురించి విని ఉన్నారు. ఎవరయినా తుమ్మి 'అల్‌హమ్దులిల్లాహ్‌ా' అని పలికినపుడు, దానికి జవాబుగా 'యర్‌హముకల్లాహ్‌ా' అని చెప్పటం ధర్మం అన్న విషయం ఆ న్యూ ముస్లిం సహాబికి తెలుసు. సామూహిక నమాజు వేళ కాగానే అందరూ నమాజుకు ఉపక్రమించారు. ఆ న్యూ ముస్లిం సహాబి కూడా అందరితో కలిసి నమాజుకు నిలబడ్డారు. నమాజు మధ్యలో ఎవరికో తుమ్ము వచ్చింది. అంతే! దానికి సమాధానంగా ముఆవియ (ర ) 'యర్‌హముకల్లాహ్!' అని బిగ్గరగా అనేశారు. కొంతమంది సహాబా ఆయన్ని తీక్షణంగా చూశారు. 'అదేంటీ, మీరంతా నన్ను అలా చూస్తారేమిటి?' అని ముఆవియ (ర ) నమాజులోనే అడిగేశారు. అప్పుడు సహాబీలలో కొందరు కాళ్ళపై చేతులు చరిచి 'సుబ్‌హానల్లాహ్' అన్నారు. 'ఓహో! నమాజులో ఇలా మాట్లాడకూడదు కాబోలు' అనుకుని మౌనం వహించారు ముఆవియా.
సలాం చెప్పి నమాజు ముగించిన తర్వాత దైవప్రవక్త (స ) వెనుతిరిగి, ''నమాజు మధ్యలో మాట్లాడిందెవరు?'' అని అడిగారు. జనులంతా ముఆవియా వైపు సైగ చేశారు.
ఆ సన్నివేశాన్ని ముఆవియ (ర ) మాటల్లోనే దర్శించండి - ఆయన ఇలా అన్నారు: ''నా తల్లిదండ్రులను దైవప్రవక్త (స ) కు అర్పింతు! నేను ప్రవక్త (స ) వారిని మించిన సంస్కర్తను అంతకుముందుగానీ, ఆ తర్వాత గానీ ఎక్కడా చూడలేదు. ఆయన (స ) నన్ను కోప్పడలేదు సరి కదా, ఆప్యాయంగా నన్ను దగ్గరకు పిలిచి, ''ఇది నమాజు నాయనా! నమాజులో మాట్లాడకూడదు కదా! నమాజులో ఖుర్‌ఆన్ పఠించ బడుతుంది. దైవనామం స్మరించబడుతుంది. దైవ కీర్తన జరుగుతుంది'' అని మాత్రం సుతిమెత్తగా చెప్పారు.

No comments:
Post a Comment